టీచర్ల సమ్మె: విపక్షాల ప్రత్యక్ష చర్య
హైదరాబాద్: గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులకు అఖిల పక్షం మద్దతు తెలియజేసింది. సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయుల సమ్మెపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశం ఏర్పాటైంది. ఉపాధ్యాయుల సమ్మెను పరిష్కరించకపోతే ప్రత్యక్ష చర్యకు దిగుతామని ఆ పార్టీలు చెప్పాయి. ఉపాధ్యాయుల కోర్కెలు న్యాయమైనవని ఆ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి (తెలుగుదేశం), పరకాల ప్రభాకర్ (ప్రజారాజ్యం), నాయని నర్సింహారెడ్డి (తెలంగాణ రాష్ట్ర సమితి)లతో పాటు 15 పార్టీల నాయకులు హాజరయ్యారు.
ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయమైనవని, వాటిని ప్రభుత్వం పరిష్కరించడం అవసరమని బి.వి. రాఘవులు (సిపిఎం) అన్నారు. ఉపాధ్యాయుల సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె బుధవారంనాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉపాధ్యాయుల సమ్మెతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. పాఠాలు జరగక పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications
