పార్టీ నేతలపై డిఎస్ మరోసారి గుర్రు
హైదరాబాద్: తెలంగాణపై బహిరంగ ప్రకటనలు చేస్తున్న పార్టీ నాయకులపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణపై బహిరంగ ప్రకటనలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో హెచ్చరించారు. తెలంగాణపై బహిరంగ ప్రకటనలు మానేయకపోతే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై, పార్టీపై గౌరవం లేనట్లేనని ఆయన అన్నారు.
తెలంగాణపై నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించిన తర్వాత బహిరంగ ప్రకటనలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ విషయం చెప్పినా నాయకులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుందనే పద్ధతిలో నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్ణయమే తీసుకోనప్పుడు అలా మాట్లాడడం సరైంది కాదని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానవర్గానికి అప్పగించి, నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నామనే విషయాన్ని పార్టీ నాయకులు గుర్తించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
