తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన ఎన్టీపి
హైదరాబాద్ : తెలంగాణ కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించినట్టు నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపి) అధినేత దేవేందర్‌గౌడ్ ఆదివారంనాడు తెలిపారు. రాజకీయ వాతావరణం తెలంగాణకు అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. ఇక నుంచి తెలంగాణలో అన్నీ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం స్టిక్కర్లను అతికిస్తామని అన్నారు. కార్లు, ద్విచక్రవాహనాలపై తెలంగాణ స్టిక్కర్లను అతికించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఉద్యమం అహింసాయుతంగా జరపాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. స్వయంపాలన కోసమే తాము ఉద్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రముఖ స్వాత్యంత్ర్య సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్న తమ ఉద్యమానికి సహకారం అందించాలని ఆయన తెలంగాణలో స్థిరపడిన తెలంగాణేతర ప్రజలను కోరారు. తమ ఉద్యమం తెలంగాణేతర ప్రజలకు వ్యతిరేకమైంది కాదని ఆయన చెప్పారు. గత 60 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిన దోపిడీకి తాము వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు హక్కులను కాలరాసినప్పుడు వాటిని సాధించుకోవాలనే అంబేడ్కర్ స్ఫూర్తితోనే తాము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించుకున్నామని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని ఆయన అన్నారు.
అనంతరం సచివాలయం ఆంధ్రప్రదేశ్ బోర్డును తొలగించడానికి ఎన్టీపి కార్యకర్తలు, నాయకులు బయలుదేరారు. దాంతో ఉద్రిక్తత నెలకొంది. దేవేందర్ గౌడ్ తో సహా ఇతర ఎన్టీపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications
