ముంబయి టెర్రర్: 90 మంది బలి

తొలుత ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్‌టీ) రైల్వే స్టేషన్లోకి ఇద్దరు ఉగ్రవాదులు గ్రెనేడ్లు, ఏకే-47లతో చొరబడి రిజర్వేషన్ కౌంటర్ వద్ద విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అదే సమయంలో స్టేషన్ బయట పేలుళ్లు కూడా జరిగాయి. వారిని వేటాడేందుకు రైల్వేస్టేషన్లో ముంబయి పోలీసుల కమాండో ఆపరేషన్ మొదలైంది. టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి ఏకే-47లు పట్టుకున్న 22, 28 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఒబరాయ్ హోటల్లోకి చొరబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సందర్భంగా హోటల్లో రెండు పేలుళ్లు జరిగాయి. ఒబరాయ్ హోటల్లో 40 మందిని బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. ఇక్కడ ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ పాస్ పోర్టులున్న వారికోసం గాలించినట్లు తెలుస్తోంది. వారందరినీ హోటల్ పైభాగానికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. ఉగ్రవాదులు భద్రతా దళాలు లోపలికి రాకుండా నిలువరించేందుకు హోటల్ పైభాగం నుంచి బాంబులు విసిరారు. కమాండో ఆపరేషన్ మొదలైంది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు విజయ్ సలాస్కర్ ఎదురు కాల్పుల్లో చనిపోయారు.
గేట్‌వే ఆఫ్ ఇండియా పక్కన ఉండే తాజ్ హోటల్ వద్ద జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. తాజ్ హోటల్ పైభాగంలో భారీపేలుళ్లు సంభవించాయి. దాంతో అత్యంత విలాసవంతమైన రూఫ్ టాప్ అగ్నికి ఆహుతై పోతోంది. వీవీఐపీలు ఉండే తాజ్‌లో ఏం జరుగుతోందో తెలియకుండా ఉంది. ఇక్కడ ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఒక బాంబును నిర్వీర్యం చేశారు. గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర బాంబులతో నిండిన పడవను పోలీసులు పట్టుకున్నారు. కొలాబా, కామా ఆసుపత్రి, ట్రిడెంట్ హోటల్ వద్ద కూడా దాడులు జరిగాయి. వాటి వివరాలు తెలియాల్సి ఉంది. ఒబరాయ్ హోటల్ వద్ద నుంచి ఇద్దరు ఉగ్రవాదులు పోలీసు వ్యాన్లో మంత్రాలయ(సచివాలయం) వైపు పారిపోయారు. అక్కడ పోలీసులపై కాల్పులు జరిపారు. ముగ్గురు పోలీసులు మరణించారు. అందులో డీఐజీ అశోక్ కంతే మరణించినట్లు భావిస్తున్నారు. బాంబు పేలుళ్లు జరిగిన స్థలంలో పరిశీలిస్తున్న ఉగ్రవాద నిరోధక దళం అధిపతి హేమంత్ కర్కరే మరణించారు. మరో ఐదుగురు పోలీసులకు మరో పేలుడు జరిగి గాయాలు అయినట్లు సమాచారం. ఒబరాయ్‌కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని గిర్‌గామ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అయితే, వారిని పోలీసులు కాల్చిచంపారు. ఒబరాయ్ నుంచి పారిపోయిన వారు వీరేనని భావిస్తున్నారు. జుహూలోని మారియట్ హోటల్ వద్ద కూడా పేలుళ్లు జరిగాయి.












Click it and Unblock the Notifications
