• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విదేశీ శక్తుల పనే: మన్మోహన్

By Staff
|

Manmohan Singh
ముంబయి: ముంబాయి ఉగ్రవాద దాడి సంఘటనను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద సంస్థలకు తన భూభాగం నుంచి ఆశ్రయం కల్పించడం కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని పాకిస్థాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన అంతర్గత, బాహ్య ముప్పులపై తుది నిర్ణయం తీసుకొనే భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఎస్‌) సమావేశానికి అధ్యక్షత వహించారు. ముంబాయిపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దేశ భద్రత పరిస్థితిని ఈ కమిటీ సమీక్షించింది. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కుట్రలను సమూలంగా నాశనం చేసేందుకు ఏం చేయాలనే అంశంపై చర్చించారు.

గురువారం మధ్యాహ్నం టీవీ ఛానెళ్లలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ - ఇది పాకిస్థాన్‌లో తలదాచుకున్న ముఠాల పనేనని తేల్చారు. తన ప్రసంగంలో మూడుసార్లు పాకిస్థాన్‌ ప్రస్తావన తెచ్చారు.''ఒక పథకం ప్రకారం, సమన్వయంతో దాడులు జరిగాయి. బహుశా బయటి సంబంధాలు సాయపడ్డాయి. ఉన్నత స్థాయి లక్ష్యాలను ఎంచుకొని విచ్చలవిడిగా విదేశీయులను కాల్చి చంపడం ద్వారా ప్రజల్లో భయాందోళనలను సృష్టించడం వారిలక్ష్యం'' అని అన్నారు.

''మనపై దాడులకు వారి భూభాగాలను వాడుకోనిస్తే సహించేది లేదని మన పొరుగు దేశాలకు గట్టిగా చెబుదాం. తగిన చర్యలు తీసుకోకపోతే అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెబుదాం'' అని అన్నారు. భారత పౌరుల భద్రతను భంగపరచి ఉగ్రవాదులు తప్పించుకొనే పరిస్థితిని భరించేందుకు సిద్ధంగా లేమని ముంబాయిలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాద సంస్థ మూలాలు దేశం బయటే ఉన్నాయన్నది రూఢీ అయ్యిందని, భారత ఆర్థిక రాజధానిలో భయోత్పాతం సృష్టించాలన్న ఒకే ఒక లక్ష్యంతో, దృఢ సంకల్పంతో ఈ ముఠా దేశంలోకి అడుగు పెట్టిందని ఆయన అన్నారు.

ఇక అలాంటి ఉగ్రవాద దాడులు పునరావృతం కానివ్వబోనని ప్రధాని ప్రతిజ్ఞ చేశారు. అందుకు అవసరమైన అన్ని గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశ ప్రజల భద్రతకు అవసరమైన ఎలాంటి చర్య తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.

అత్యంత అవసరమైన చర్యల్లో భాగంగా పోలీసు సంస్కరణలను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని ప్రకటించారు. జాతీయ భద్రత చట్టాన్నిఅవసరాన్ని బట్టి ఉపయోగిస్తామని, ఉన్న ఇతర చట్టాల్లోని లొసుగులు తొలగిస్తామని అన్నారు. ఇనుము వేడిగా ఉన్నపుడే వంచాలన్న వైఖరిని ప్రదర్శించిన ప్రధాని వివాదాస్పద 'జాతీయ దర్యాప్తు సంస్థ' ఏర్పాటును మరోసారి ప్రతిపాదించారు. ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసేందుకు ఈ వ్యవస్థను ఉపయోగించుకుందామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X