కేంద్ర హోంమంత్రిగా చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పి. చిదంబరంకు అప్పగించారు. చిదంబరం కేంద్ర హోం మంత్రిగా పదవీ బాధ్యతులు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు చిదంబరం నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను ప్రధాని స్వయంగా చూడనున్నారు. హోం మంత్రిగా శివరాజ్ పాటిల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చిదంబరం నియమితులయ్యారు. ముంబయి ఉగ్రవాద దాడులకు బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ రాజీనామా చేశారు. శనివారం రాత్రి జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో శివరాజ్ పాటిల్ తీరుపై విమర్శలు వచ్చాయి. దీని నుంచి బయట పడడానికి ఏదో ఒకటి చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో పాటిల్ రాజీనామా చేయక తప్పలేదు.
చిదంబరం గతంలో అంతర్గత భద్రతా శాఖలో పని చేశారు. తాజ్, ట్రైడెంట్ హోటళ్లలో, నారిమన్ హౌస్ లో చొరబడిన ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి జాతీయ భద్రతా బలగాలను రంగంలోకి దింపడంలో జాప్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాను రాజీనామా చేస్తానని పాటిల్ శనివారంనాటి సిడబ్ల్యుసి సమావేశంలోనే చెప్పారు. ఆదివారం ఉదయం తన రాజీనామా లేఖను ప్రధానికి పంపారు. శివరాజ్ పాటిల్ తీరుపై ప్రతిపక్షాల నుంచే కాకుండా ఆర్జెడీ వంటి మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ స్థితిలో శివరాజ్ పాటిల్ తప్పుకోవాల్సిన అగత్యంలో పడ్డారు.












Click it and Unblock the Notifications
