ఉండవల్లిని ఓడిస్తాం: ప్రజా సంఘాలు
రాజమండ్రి: ఏడాది క్రితం రాజమండ్రి నగరపాలక సంస్థ సమావేశంలో అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ఓడించి తీరుతామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అసోసియేషన్, మాల మహానాడు ప్రతినబూనారు. ఈ మేరకు వారు తమ సంఘాల తరపున ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకుని ఉండవల్లిని ఓడించాలంటూ తీర్మానించుకున్నారు. ఈ విషయాలను శనివారం వేర్వేరుగా విలేఖరుల సమావేశాలు ఏర్పాటుచేసి ఉండవల్లిని ఓడిస్తామంటూ ప్రకటించారు.
ఎస్సీ కాలనీల్లో ఉండవల్లిని అడుగుపెట్టబోనివ్వమని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రత్నాకర్ హెచ్చరించారు. అంబేద్కర్‌పై వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణ చెప్పినంతమాత్రాన ఉండవల్లిని దళితులు క్షమించరని..రానున్న ఎన్నికల్లో ఆయన్ను ఓడించడమే తమ లక్షయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కేకే సంజీవరావు, బీర భూషణం, సానబోయిన శుభలక్ష్మిలు ఇప్పటికే ఉండవల్లికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉండవల్లి హయాంలో ఏ ఒక్కరోజూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. పైగా రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ, ఎస్టీలపై అనేక దాడులు జరిగినప్పటికీ బాధ్యతాయుతమైన ఎంపీగా స్పందించకపోగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదుచేయకుండా అడ్డుపడ్డారని వారు ఆరోపించారు.
ఎంపీ ఉండవల్లికి కావలసిన సామాజికవర్గానికి చెందిన వారినే అధికారులుగా తెచ్చుకుని బాధితులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారంచేసి ఆయన గెలవకుండా చేస్తామన్నారు. ఇదే అదునుగా ప్రత్యర్ధి పార్టీలైన టీడీపీ, పీఆర్పీలు ఉండవల్లిపై దృష్టి సారించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్, మాల మహానాడు నాయకులు ఉండవల్లికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉండవల్లిని ఓడించడానికి మాకు మీరు సపోర్టు చేయాలంటూ ఆయా సంఘాల నేతల్ని కోరేందుకు టీడీపీ, పీఆర్పీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications