లుంబినీ పేలుళ్ల కేసులో చార్జిషీట్
హైదరాబాద్: హైదరాబాదులోని లుంబినీ పేలుళ్ల కేసులో ఆక్టోపస్ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. 2007 ఆగస్టు 25వ తేదీన లుంబినీ పార్కులో జరిగిన పేలుళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే రోజు హైదరాబాదులోని కోఠీలో గల గోకుల్ చాట్ లో కూడా పేలుళ్లు సంభవించాయి. లుంబినీ కేసులో మాత్రం పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయబోతున్నారు. గోకుల్ చాట్, దిల్ షుక్ నగర్ కేసుల్లో చార్జిషీట్ కు మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది.
లుంబినీ పేలుళ్ల కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను పేర్కొన్నారు. వీరంతా పాకిస్తాన్ కు చెందిన ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు. వీరిలో నలుగురిని ముంబయి నుంచి తీసుకొచ్చి పోలీసులు విచారించారు. ఈ నలుగురిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అనిక్, అక్బర్, ఫరూక్, షాజిక్ పోలీసుల అదుపులో ఉన్నారు. లుంబినీ పార్కులో పేలుళ్లకు పథకం రచించిన సూత్రధారులు అమీర్ రజాక్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ కేసులో తమ అదుపులో ఉన్న నిందితులను 45 రోజుల పాటు ఆక్టోపస్ పోలీసులు విచారించారు. మొత్తం 159 మంది సాక్షులను విచారించారు.












Click it and Unblock the Notifications