కెసీఅర్ పై తెలంగాణ వాదుల లొల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అంశం మరో ఐదేళ్ళ వరకు అటకెక్కినట్టేనా? టీఅర్ ఎస్ అసలు కోలుకుంటుందా? తెలంగాణ సెంటిమెంట్ క్షీణించడానికి చంద్రశేఖరరావు నియంతృత్వ ధోరణే కారణమని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు.
అటు ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గాల్లో ఉండకుండా, ఇటు పార్టీ కార్యాలయానికి రాకుండా... రోజుల తరబడి ఢిల్లీ యాత్రలు, లాబీయింగ్‌కే కేసీఆర్ పెద్దపీట వేశారు. నేల విడిచి సాము చేసినట్లుగా యాజ్ఞయాగాదులను ఆశ్రయించారు. అలా కేసీఆర్ అనుసరించిన ఒంటెద్దు పోకడలు, చేసిన ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడు తెలంగాణ వాదానికి తీరని నష్టం కలిగించి ప్రమాదంలోకి నెట్టాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి 2004 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్‌లో పట్టపగ్గాలులేని తత్వం పేట్రేగిపోయిందని విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్ర విభజన సమయాన తాము అధికారంలో ఉంటే పంపకాలప్పుడు ఇబ్బంది ఉండబోదనే సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులకు ఎగబడి అసలు లక్ష్యానికి ఆదిలోనే గండికొట్టారు.
కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి మద్దతు ఇస్తూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వారిపై ఒత్తిడి తెచ్చే అవకాశాలను చేజేతులా జారవిడుచుకున్నారు. దీంతో కేసీఆర్ వైఖరితో విసిగి టీఆర్‌ఎస్‌లో ఆది నుంచి ఉన్న అనేక మంది తెలంగాణవాదులు పార్టీకి దూరమయ్యారు. తాను 'ఎస్' అంటే మరో ఆలోచన లేకుండా 'ఓ ఎస్' అనే కోటరీకే కేసీఆర్ పెద్దపీట వేశారు.
2006 కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలో కేసీఆర్ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కేవలం తెలంగాణవాదం కోసం అనేక శక్తులు ఆయన గెలుపు కోసం పనిచేశాయి. దీంతో రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో కేసీఆర్ గెలిచారు. ఆ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమ ఉద్ధృతికి పకడ్బందీ ప్రణాళిక రచించి అమల్లో పెట్టకుండా.. కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్లు విధించటానికే కేసీఆర్ పరిమితమయ్యారు.
గత ఏడాది మరోసారి రాజీనామాలు చేసి తెలంగాణ ఓటర్లకు పరీక్ష మీద పరీక్ష పెట్టారు. అప్పటికే కేసీఆర్ చేసిన గిమ్మిక్కులతో విసిగిన తెలంగాణ జనం టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. 16 మంది ఎమ్మెల్యేల బలాన్ని ఏడుకు, నలుగురు ఎంపీల బలాన్ని రెండుకు కుదించారు. కేసీఆర్ సైతం చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా 15వేల మెజారిటీతో నెగ్గారు. అయినప్పటికీ కేసీఆర్ తన తప్పిదాలను అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications