ఎన్డీయెకు బీటలు: సమావేశం వాయిదా
న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) సమావేశం రద్దయింది. ఎన్డీయేలో చీలికలు రావడంతో సమావేశాన్ని వాయిదా వేయక తప్పలేదని తెలుస్తోంది. సమావేశానికి రావడానికి కొన్ని భాగస్వామ్య పార్టీలు తమ అసక్తతను వ్యక్తం చేశాయి.
సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమితో కొన్ని ఎన్డీయె భాగస్వామ్య పక్షాల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒరిస్సాలో బిజెపితో తెగదెంపులు చేసుకున్న బిజెడి గొప్ప విజయాన్ని సాధించడాన్ని కొన్ని భాగస్వామ్య పక్షాలు పరిగణనలోకి తీసుకుని తాము ఒంటరిగా వెళ్లి ఉంటే మంచి ఫలితాలు సాధించి ఉండేవారమని భావిస్తున్నాయి.
రాష్ట్రీయ లోకదళ్ ఎన్డీయెతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నాయకుడు అజిత్ సింగ్ కాంగ్రెసు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జనతాదళ్ (యు) కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్లు సమాచారం. వరుణ్ గాంధీ ద్వేషపూరిత ప్రకటన, ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ముందుకు తేవడం వల్ల ప్రమాదం సంభవించిందని జెడియు నేత శరద్ యాదవ్ ఆదివారం అన్నారు.
అయితే ఎన్డీయెతో విభేదాలు పొడసూపినట్లు వచ్చిన వార్తలను జెడి(యు) నేత ప్రభునాథ్ సింగ్ ఖండించారు. ఎన్నికలను కలిసి ఎదుర్కున్నామని, కలిసే ఉంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications