లోకసభ స్పీకర్ గా కిశోర్ చంద్రదేవ్?
న్యూఢిల్లీ: లోకసభ స్పీకర్ పదవి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కిశోర్ చంద్రదేవ్ కు దక్కే అవకాశాలున్నాయి. ఆయన సీనియారిటీని ఈ విషయంలో కాంగ్రెసు అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ కుమార్ బన్సాల్ పేరును కూడా కాంగ్రెసు నాయకత్వం స్పీకర్ పదవికి పరిశీలించినప్పటికీ చివరకు కిశోర్ చంద్రదేవ్ వైపే మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.
కాగా, ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు నలుగురైదుగురికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మంగళవారం జరగాల్సిన మన్మోహన్ సింగ్ మంత్రి వర్గ విస్తరణ గురువారానికి వాయిదా పడింది. దీంతో నిరీక్షణ, ఉత్కంఠ కొనసాగుతోంది. దగ్దుబాటి పురంధేశ్వరికి మళ్లీ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో మంత్రులుగా పని చేసిన పల్లంరాజు, పురంధేశ్వరిలను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదనే వార్తలు వస్తున్నాయి.
కాగా, రాష్ట్రం నుంచి పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ మంత్రి పదవులు దక్కేది కొంత మందికే. రాష్ట్రం నుంచి 33 మంది లోకసభ సభ్యులు ఎన్నికయ్యారు. అయితే మిత్రపక్షాల ఒత్తిడి వల్ల కాంగ్రెసు త్యాగాలు చేయాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కు దక్కేది తక్కువేనని చెబుతున్నారు. కావూరి సాంబశివరాజు లేదా లగడపాటి రాజగోపాల్ కు, చింతా మోహన్ లేదా పనబాక లక్ష్మి, కె.కేశవరావు లేదా మధుయాష్కీ గౌడ్ లకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications