మరో నలుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు
హైదరాబాద్: స్వైన్ ఫ్లూ లక్షణాలతో బుధవారం మరో నలుగురు హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి నోడల్ కేంద్రంలో చేరారు. వీరిలో ఓ ప్రవాసాంధ్ర బాలిక(6), మరో ప్రవాసాంధ్ర యువకుడు ఉన్నారు. మిగిలిన ఇద్దరూ హైదరాబాద్ కు చెందినవారే. నగరానికి చెందిన 53 ఏళ్ల మహిళ కొద్దిరోజుల క్రితం అమెరికాలోని బోస్టన్ కు వెళ్లి, ఈనెల 2న తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి ఎక్కువై వారం రోజులుగా తగ్గకపోవడంతో బుధవారం ఛాతీ ఆస్పత్రికి వచ్చారు. అలాగే న్యూయార్క్ లో ఉంటున్న ఓ ప్రవాసాంధ్ర కుటుంబం బంధువులను కలుసుకునేందుకు మంగళవారం ఇక్కడికి వచ్చింది. ఆ కుటుంబంలోని ఆరేళ్ల బాలిక తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను స్వైన్ ఫ్లూ నోడల్ కేంద్రానికి తీసుకొచ్చారు.
హైదరాబాద్ కు చెందిన 25ఏళ్ల యువకుడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్నతవిద్య అభ్యసిస్తున్నాడు. ఈనెల 8వ తేదీన ఇంటికి వచ్చేసరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఛాతీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. లండన్ లో ఉంటున్న 18 ఏళ్ల ప్రవాసాంధ్రుడు ఈనెల 8న హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. జ్వరం, గొంతునొప్పి ఇబ్బంది పెట్టడంతో నోడల్ కేంద్రంలో చేరాడు. ఈ నలుగురూ స్వచ్ఛందంగా ఆస్పత్రికి వచ్చారని స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ శుభాకర్ తెలిపారు. వీరి నుంచి తీసిన నమూనాలను వ్యాధి నిర్ధరణ కోసం పంపామని, గురువారం నివేదిక అందుతుందని చెప్పారు.
స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రభావం తగ్గిపోవడంతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను బుధవారం డిశ్ఛార్జి చేశారు. అతడితోపాటు సింగపూర్ నుంచి వచ్చి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరిన మరో వ్యక్తికీ వైరస్ లేదని నిర్ధరణ అయ్యింది. దీంతో ఆయన్ను డిశ్ఛార్జి చేశారు. ఇప్పటివరకూ మొత్తం 48మందికి స్వైన్ ఫ్లూ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని శుభాకర్ తెలిపారు. వీరిలో ఏడుగురికి ఈ వ్యాధి సోకింది. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రంలో నలుగురు వ్యాధిగ్రస్థులతోపాటు మరో నలుగురు ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications