అక్రమ ప్రాజెక్టులపై ఢిల్లీకి టిడిపి
హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కొవ్వూరు ఎమ్మెల్యే రామారావుపై పెట్టిన తప్పుడు కేసు, రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం తదితర అంశాలపై తెలుగుదేశం పార్టీ తన పోరాటానికి ఢిల్లీని వేదిక చేసుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈనెల 15, 16, 17 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గురువారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, ప్రధాని మన్మోహన్ సింగ్ లతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవాలని నిశ్చయించారు.
అవసరమైతే ఒక రోజు ముందుగానే వెళ్లడానికి సిద్ధం కావాలని చంద్రబాబు వారికి సూచించారు. గోదావరిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ, మరో 11 ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరడానికి ప్రధానిని కలవాలని తెలుగుదేశం భావిస్తోంది. రామారావు కేసు విషయంలో ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు తాజాగా ఈ అంశాన్ని రాష్ట్రపతి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ మహిళా సర్పంచిపై తప్పుడు కేసు పెట్టిన ఉదంతంపై స్పందించిన టీడీపీ 11న కారంచేడు వెళ్లాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications