ఒంగోలు: తనని చేపల పులుసు అని ఎగతాళి చేస్తున్నారని, మరి పురంధరేశ్వరి ఏ పులుసు చేసి, ఎవరికి వడ్డించి రెండోసారి మంత్రి అయిందని తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. ఆమె మంగళవారం ఉదయం ఒక టీవీ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆవేశపడిపోయారు. ప్రకాశం జిల్లా కారంచేడులో నిన్న తెదేపా నేత నన్నపనేని రాజకుమారిపై జరిగిన దాడికి నిరసనగా ఈ రోజు జిల్లాలో భారీ ధర్నాకు తెదేపా పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో నన్నపనేనితో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. మహిళనని కూడా చూడకుండా ముందస్తు ప్రణాళికతో దాడి చేయించిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావును అరెస్టు చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని నన్నపనేని తెలిపారు.