కొత్త యుగానికి నాంది : పిఎం
న్యూఢిల్లీ: సహకార సామరస్యాలతో కొత్త యుగాన్ని ప్రారంభిద్దామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జాతికి పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రాజకీయ స్థిరతకు, ఆర్థిక పటిష్టతకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగే బంగారు భవిష్యత్తు కోసం పని చేస్తుందని ఆయన చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. ఏకాభిప్రాయ, సహకార వాతావరణ కల్పనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన కోరారు. విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని, లౌకిక విధానాన్ని తాము అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు.
రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ధరల పెరుగుదలను అరికడ్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో మరో హరిత విప్లవం సాధిస్తామని ఆయన చెప్పారు. రైతులు, శాస్త్రవేత్తలు కలిసి సేద్యంలో ఆధునిక పద్ధతులకు శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. వ్యాపారవేత్తలు తమ సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలని ఆయన కోరారు. అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయం పెట్టాల్సిన అవసరం ఉందని, అందుకు దేశీయ వనరులను, విదేశీ వనరులను సమకూరుస్తామని ఆయన చెప్పారు. దేశంలో తగిన ఆహార నిల్వలున్నాయని, ధరలను అదుపు చేస్తామని ఆయన చెప్పారు.
స్వైన్ ఫ్లూకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దీన్ని అదుపు చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని ప్రధాని చెప్పారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఉగ్రవాదాన్ని అణచివేయగలమని ఆయన అన్నారు. ఉగ్రవాదం ప్రపంచ సమస్యగా మారిందని, ముంబై దాడుల తర్వాత దేశ అంతర్గత భద్రతకు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. భారత ప్రజాస్వామ్య బలాన్ని నక్సలైట్లు అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. మావోయిస్టు సమస్యను ఎదుర్కోవడానికి కేంద్రం రాష్ట్రాలకు తగిన సహకారం అందిస్తుందని చెప్పారు.
పొరుగు దేశాలతో సామరస్యాన్నే తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే పాకిస్తాన్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. భారత్ నీటి కొరతను ఎదుర్కుంటోందని మన్మోహన్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం పానీ బచావో నినాదాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications