అభివృద్ధితో రుణం చెల్లిస్తా: సిఎం
హైదరాబాద్: అభివృద్ధితో రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని ఆయన చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్నా సాగునీటి ప్రాజెక్టులు, గృహ నిర్మాణాలు ఆగవని ఆయన చెప్పారు.
స్వాతంత్ర్య సమరయోధులు దేనికోసమైతే త్యాగాలు చేశారో ఆ లక్ష్యం దిశగా మనం పయనిస్తున్నామా లేదా అనే సందేహం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రజలు ఏ అభివృద్ధినైతే ఆశించి ఓట్లు వేశారో ఆ అభివృద్ధిని సాధిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కంది పంట విస్తీర్ణం పెరుగుదలకు కృషి చేస్తున్నామని, ధరల అదుపునకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.
కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు 84 ప్రాజెక్టులు చేపట్టామని, పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని, అది ఫలించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మరిన్ని కేంద్ర నిధుల కోసం అడిగామని, మన పథకాలు నచ్చింనందున ఆ నిధులు ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు, ఓడరేవుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications