హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అరెస్టుకు కలత చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దిడ గ్రామంలో శ్రీకాంత్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కరీంనగర్ జిల్లాలో పృథ్వీరాజ్ అనే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
జైలులో ఉన్న కెసిఆర్ ఆరోగ్యం విషమించిందనే వార్తతో గుండెపోటు వచ్చి ఒక వ్యక్తి మరణించాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నర్సయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కాగా, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కెసిఆర్ జైలు నుంచి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస నాయకుడు హరీష్ రావు కూడా అదే విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా పోరాడి తెలంగాణ సాధించుకుందామని, ఆత్మహత్యలకు తెలంగాణవాదులు పాల్పడవద్దని హరీష్ రావు కోరారు.