హైదరాబాద్: నిరాహార దీక్ష ప్రారంభించక ముందే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును అరెస్టు చేయాలని తాను హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సలహా ఇవ్వలేదని మాజీ హోం మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె.జానారెడ్డి స్పష్టం చేశారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను ఇచ్చిన సలహాపై పత్రికల్లో వచ్చిన విభిన్న కథనాలను ఆయన ఎత్తి చూపారు. తాను ఏం సలహా ఇచ్చాననే విషయంపై సబితా ఇంద్రారెడ్డిని అడిగితేనే బాగుంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని సంప్రదించి ఆలోచించుకోవాలని మాత్రమే తాను సబితా ఇంద్రారెడ్డికి చెప్పినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. కెసిఆర్ ఒక వ్యక్తి మాత్రమేనని, యాభై ఏళ్లుగా మాసిపోని శక్తి తెలంగాణకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశం సులభంగా పరిష్కారమయ్యేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కెసిఆర్ ను ఒక రోజైనా దీక్ష చేయించాల్సి ఉండిందని, హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు కెసిఅర్ ను అరెస్టు చేస్తే బాగుండేదని ఆయన అన్నారు. కెసిఆర్ ముందస్తు సరైంది కాదని ఆయన చెప్పారు.