హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు స్వతంత్ర ఉద్యమం చేపట్టడానికి మంగళవారం ఉద్యుక్తులయ్యారు. శాంతియుతంగా ఉద్యమం సాగిస్తామని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరాహార దీక్షలు సాగించడానికి సిద్ధపడుతున్నారు. విద్యార్థినులు పెద్ద యెత్తున ఉస్మానియాలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేతులకు సంకెళ్లు వేసుకుని, మూతులకు నల్ల వస్త్రం కట్టుకుని ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తాము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తామని వారు చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఎవరూ లేరు. పోలీసులకు ప్రవేశం లేదంటూ బోర్డులు తగిలించారు. ఈ స్థితిలో శాంతియుతంగా ఉద్యమాలు చేస్తామని విద్యార్థులు స్పష్టంగా చెబుతున్నారు.
వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు ఆందోళనకు నడుం బిగించారు. ముగ్గురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారు. మిగతా విద్యార్థులు రిలే నిరాహార దీక్షలకు పూనుకుంటున్నారు. కెసిఆర్ దీక్షను భగ్నం చేసిన నేపథ్యంలో స్వతంత్రంగా విద్యార్థి ఉద్యమాన్ని సాగించేందుకు సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) ఏర్పిడింది. విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న ఈ జెఎసి తెలంగాణ సాధన కోసం విద్యార్థి ఉద్యమాలకు కార్యాచరణను రూపొందించి, సమన్వయం చేస్తుంది. సోమవారం కెసిఆర్ పై భగ్గుమన్న విద్యార్థులు మంగళవారం చల్లబడ్డారు. కెసిఆర్ కు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు.