ఖమ్మంలో కెసిఆర్ కు భద్రత లేదు: జయశంకర్

మంగళవారం ముఖ్యమంత్రి కె. రోశయ్య, డిజిపి గిరీష్ కుమార్, ఇంటిలిజెన్స్ ఐజి మహేందర్ రెడ్డి కెసిఆర్ తో మాట్లాడారని, వారు ఆరోగ్యం గురించి వాకబు చేశారు తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదని ఆయన చెప్పారు. తమ ముఖ్య లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెసిఆర్ జీవితంతో తెలంగాణ ఉద్యమం ముడిపడి ఉందని, అందువల్ల కెసిఆర్ ఆరోగ్యం కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమంలో ఒక మెట్టు మాత్రమేనని, దాంతో ఉద్యమం ఆగదని, మరింత ఉధృతమవుతోందని అన్నారు. వైద్యులు ఏం చేస్తారో చెప్పడం కష్టమని, కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రమాదకరంగానే ఉందని ఆయన చెప్పారు. దేన్నైనా తాము ఎదుర్కుంటామని చెప్పారు.
పోలీసులు అవమానకరంగా వ్యవహరించారని, ఇద్దరు శాసనసభ్యులను ఈడ్చుకెళ్లారని, తలుపులు పగులగొట్టి కెసిఆర్ గదిలోకి ప్రవేశించారని, పోలీసులు కెటి రామారావును, నాయని నర్సింహారెడ్డిని కొట్టారని ఆయన చెప్పారు. విద్యార్థుల పోరాటం ఉద్యమాన్ని ఉధృతికి ఊతం ఇస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రాణత్యాగానికి పాల్పవడద్దని, అవసరమైతే తాము ప్రాణ త్యాగం చేస్తామని ఆయన చెప్పారు. ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ రాదని, పోరాటం ద్వారా మాత్రమే వస్తుందని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే తాము తెలంగాణ సాధన కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను తెరాస ఆదుకుంటుందని ఆయన చెప్పారు. సమిష్టి పోరాటాలను తాను సమర్థిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications