హైదరాబాద్: తనకు వ్యక్తిగత వైద్యునిగా యశోద ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఎంవీ రావును నియమించవలసిందిగా కేసీఆర్ కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి ఆదేశాన్ని అనుసరించి ప్రభుత్వం డాక్టర్ ఎం.వీ.రావుని కేసీఆర్ వ్యక్తిగత వైద్యునిగా నియమించింది. కెసిఆర్ గతంలో కాలేయ, పేగులకు సంబంధించిన (గ్యాస్ట్రో ఎంటరాలజీ) సమస్యలకు యశోదలో ఎంవీ రావు నుంచి చికిత్స పొందారు. ఆయన సలహాపై మద్యం మానేసినట్టు కెసీఅర్ ఒక టీవీ కార్యక్రమంలో చెప్పారు కూడా.
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తెరాస అధినేత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు మీడియాకు ఈ ఉదయం 11 గంటలకు వివరించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం నీరసంగా ఉన్నారని తెలిపారు. ఆయనకు నిర్వహించిన పలు వైద్య పరీక్షల రిపోర్టు సాధారణంగా వచ్చిందని.. మూత్ర పరీక్షలో మాత్రం కొద్ది తేడా ఉన్నట్లు వెల్లడించారు. వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.