Silver 100: తక్కువ డబ్బుతో వెండి బిజినెస్ చేసే ఛాన్స్
వెండి మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని ఉందా? కానీ వేలల్లో, లక్షల్లో డబ్బులు లేవని ఆగిపోతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. సాధారణ మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న నగల వ్యాపారులు కూడా కేవలం వంద గ్రాముల వెండితో కమోడిటీ మార్కెట్లోకి అడుగుపెట్టేలా సరికొత్త అవకాశం వచ్చేసింది. ఇప్పటివరకు పెద్ద పెద్ద సంస్థలు, భారీ ఇన్వెస్టర్లకే పరిమితమైన వెండి ట్రేడింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తూ 'మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్' (MCX) జూన్ 1, 2026న 'సిల్వర్ 100' ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లను అధికారికంగా ప్రారంభించింది.
ఈ కొత్త విధానం ప్రకారం.. ఎవరైనా సరే కేవలం 100 గ్రాముల పరిమాణంతో వెండి ఒప్పందాలు (ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లు) చేసుకోవచ్చు. దీనివల్ల వెండి ధరలు అమాంతం పెరిగినా, తగ్గినా నష్టపోకుండా చిన్న వ్యాపారులు తమ పెట్టుబడులను కాపాడుకోవచ్చు (హెడ్జింగ్). ఎంసీఎక్స్‌లో ఇప్పటికే 30 కిలోలు, 5 కిలోలు, 1 కిలో పరిమాణాల్లో వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వీటన్నింటికీ అదనంగా ఈ సరికొత్త 100 గ్రాముల ప్లాన్‌ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన క్లియరింగ్, సెటిల్‌మెంట్ బాధ్యతలను 'ఎంసీఎక్స్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్' (MCXCCL) చూసుకోనుంది.

చిన్న వ్యాపారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు వరం
ఈ సరికొత్త 'సిల్వర్ 100' కాంట్రాక్ట్ మనదేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (SMEలు), స్థానిక నగల దుకాణదారులకు ఎంతో మేలు చేస్తుందని ఎంసీఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రవీణా రాయ్ తెలిపారు. మార్కెట్లో వెండి ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఈ చిన్న కాంట్రాక్టులు రక్షణ కల్పిస్తాయన్నారు.
వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్ (ఇన్వెంటరీ) అవసరాలకు తగినట్లుగా చిన్న మొత్తాల్లోనే డెలివరీ తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. తక్కువ పరిమాణం కావడం వల్ల చేతిలో ఎక్కువ డబ్బు (మూలధనం) లేకపోయినా వ్యాపారాన్ని సులభంగా రన్ చేసుకోవచ్చని, కాంట్రాక్ట్ గడువు ముగిశాక ఎలాంటి మోసాలు లేకుండా, పారదర్శకమైన మేకింగ్ ఛార్జీలతో పూర్తి క్వాలిటీ గల వెండిని ఫిజికల్‌గా డెలివరీ ఇస్తామని రాయ్ పేర్కొన్నారు.
ఖాతాదారులు, మార్కెట్ వ్యాపారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈ సరికొత్త కాంట్రాక్ట్‌ను డిజైన్ చేసినట్లు ఎంసీఎక్స్ సంస్థ తెలిపింది. అంతేకాదు, వెండి డెలివరీ నిబంధనలను సవరిస్తూ ఎక్స్ఛేంజ్ ఒక ప్రత్యేక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా మనదేశంలోని స్థానిక రిఫైనర్లను కూడా తమ జాబితాలోకి ఆహ్వానిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాల నుంచి వెండి దిగుమతి చేసుకోవడం తగ్గి.. మనదేశంలోనే రీసైక్లింగ్ ప్రక్రియ మరింత పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వెండి మార్కెట్లో రాణించాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశమనే చెప్పాలి.














Click it and Unblock the Notifications