హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆమె సోమవారం ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే రోశయ్య ఆమెకు సర్దిచెప్పారు. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల తీరుపై ఆమె తీవ్రంగా కలత చెందినట్లు చెబుతున్నారు. విద్యార్థులను పరామర్శించడానికి వస్తున్న శాసనసభ్యులను అనుమతించాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అయితే అందుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆమె రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం.
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల పట్ల అతిగా వ్యవహరిస్తున్నారంటూ డిసిపి స్టీఫెన్ రవీంద్రపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ స్థితిలో స్టీఫెన్ రవీంద్రపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్ రవీంద్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలను ధిక్కరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. డిసిపి ముఖ్యమా, హోం మంత్రి ముఖ్యమా అని ఆయన పోలీసులను అడిగారు.