హైదరాబాద్: రాష్ట్రాల విభజనపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, తెలంగాణపై కూడా కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. తెలంగాణపై తమ నివేదికను ఇప్పటికే తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి పంపామని, నివేదికను పార్టీ అధిష్టానం ఈ రోజు పరిశీలిస్తుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
కేంద్రం నిర్ణయం తీసుకుంటే తెలంగాణపై శాసనసభలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. తాను రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలనే ప్రతిపక్షాల డిమాండ్ ను ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.