తెలంగాణ ప్రక్రియ అంటే సంప్రదింపులే: సిఎం

రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి రాజకీయ నాయకులు ప్రయత్నించాలని ఆయన సూచించారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో మాట్లాడానని, సంయమనం పాటించాలని ఉమ్మడిగా పిలువునివ్వడానికి ఈ సమావేశం పెట్టానని, అయితే ఈ సమావేశానికి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాలేదని, తాము విడిగా శాంతియుత పరిస్థితి స్థాపనకు ప్రయత్నిస్తామని చెప్పారని ఆయన చెప్పారు. విద్యార్థులు ఉద్రేకాలకు లోను కావద్దని, చదువులు పాడు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా, శాంతియుత పరిస్థితులు దెబ్బ తినకుండా చూడాలని ఆయన సూచించారు. రాష్ట్రం ఆందోళనలకు నిలయమనే భావనను పారదోలుదామని ఆయన చెప్పారు.
శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే ప్రభుత్వం మైనారిటీలో పడుతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజీనామాలు చేసినవారిలో అన్ని పార్టీ సభ్యులున్నారని ఆయన చెప్పారు. ఏ పార్టీకి అల్లర్లు ప్రేరేపించాలని ఉండదని ఆయన అన్నారు. సరైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని మాత్రమే కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారని ఆయన చెప్పారు. సరైన సమయంలో అనే పదం చిదంబరం వాడలేదని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా తాను టెలివిజన్ చూడలేదని చెప్పారు. దానిపై మీడియా ప్రతినిధులు మరీ మరీ ప్రస్తావించగా ఆయన చిరాకు పడ్డారు. ఇటువంటి ప్రశ్నలు వేయవద్దని ఆయన సూచించారు. పార్టీ అధిష్టానం చేసిన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పుడు రాజీనామాలు చేయడమేమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వారినే అడగండని జవాబిచ్చారు. తీర్మానం చేశాం, చేస్తే ఏమిటి, ఇటువంటి ఆదేశాలను తాను స్వీకరించడానికి సిద్ధంగా లేనని, రాజీనామాలను స్పీకర్ అదేశించలేదని, పార్టీ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తుండగానే ఆయన లేచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications