విశాఖలో సమైక్యాంధ్ర ఉద్యమం అలల హోరు

సమైక్యాంధ్ర నినాదం ఆంధ్ర విశ్వవిద్యాలయమంతా మారుమోగింది. అన్ని తరగతుల విద్యార్థులను ఏకం చేసిం ది. ఏయూ ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులు గురువారం సమైక్యంగా ఉద్యమించారు. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. అన్ని విభాగాల్లో తరగతులను బహిష్కరించారు. ఏయూ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ దశలో కవరేజికి వెళ్లిన మీడియాపై మండిపడ్డారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
మీడియా ఊతం వల్లే తెలంగాణ విద్యార్థుల చిన్న ఉద్యమాలు పెద్దవయ్యాయని విమర్శించారు. ఏయూ విద్యార్థుల సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మాత్రం మీడియా తక్కువగా చూపిస్తోందని ఆరోపించారు. తమ ఉద్యమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యమానికి ఆంధ్ర ప్రాంత రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతివ్వటం లేదన్నారు. అధికారం కోసం వారిలాగే వ్యవహరిస్తే ఆంధ్ర వీధుల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.
గురువారం ఉదయం 9 గంటల నుంచి అన్ని కళాశాలల విద్యార్థులు బయల్దేరారు. అన్ని విభాగాల నుంచి విద్యార్థులను కూడగట్టడం ప్రారంభించారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఏయూలో భారీగా ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ కపట రాజకీయాలకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వత్తాసు పలుకుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణకు మద్దతిస్తున్న బీజేపీకి ఆంధ్ర గురించి ఏం తెలుసన్నారు. ప్రాణత్యాగాలతోనే ప్రభుత్వం, రాజకీయ నేతలు తమకు మద్దతిస్తారనుకుంటే ఆత్మహత్యలకు సిద్ధమేనని విద్యార్థులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications