హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెనక కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ హస్తం ఉందని మావోయిస్టు నేత కిషన్ జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు ఆరోపించారు. రాజీనామాలు ఆధిపత్య రాజకీయాల్లో భాగమని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ప్రజల కోసం జరిగే ప్రతి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాదును దోచుకుంటున్న వారు కార్మికులు కారని, పారిశ్రామికవేత్తలు మాత్రమే దోచుకుంటున్నారని, వారిపైనే పోరాటం చేయాల్సి ఉంటుందని, పొట్టకూటి కోసం హైదరాబాదుకు వచ్చినవారికి తమ రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. పునాది వాస్తవాలను గ్రహించే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పొట్టకూటి కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సాగుతోందని, హైదరాబాదుకు పొట్ట కూటి కోసం వచ్చినవారితో పేచీ లేదని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల డిమాండ్ల విషయంలో కాంగ్రెసు రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన అన్నారు. తాము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలపరుస్తామని, జై ఆంధ్ర ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయడం బూటకమని ఆయన అన్నారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేయాలనే వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి