రాజీనామాలు ఉపసంహరించుకోవాలి: పొన్నాల

ఒక ప్రాంతం వారి మనోభావాలను మరో ప్రాంతం వారు గాయపరచవద్దని ఆయన అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించాలని ఆయన అన్నారు. తెలంగాణపై రాజ్యాంగ ప్రక్రియ మొదలైందని ఆయన అన్నారు. అనుమానాల నివృత్తికి, సూచనలు ఇవ్వడానికి అధిష్టానంతో మాట్లాడవచ్చునని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అందరూ శిరసా వహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరిని ఆయన విమర్శించారు. శాసనసభలో తెలంగాణ ఏర్పాటుకు ఏక వాక్య తీర్మానాన్ని బలపరచడానికి కాంగ్రెసు సభ్యులు మందుకు రావాలని ఆయన అన్నారు.
ఉద్యమాల పేరుతో దాడులకు పాల్పడి ఆస్తులకు నష్టం కలిగించవద్దని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరసనను శాంతియుతంగా నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని వారన్నారు. దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని ఆందోళనకారులను హెచ్చరించారు. ఉద్యమాలు జరుగుతుంటే ఎక్కడైనా అసాంఘిక శక్తులు చేరుతాయని వారన్నారు. బస్సులను ధ్వంసం చేయడం, ఆస్తులకు నష్టం కలిగించడం సరైంది కాదని వారన్నారు.