న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వస్తుందనే నమ్మకం ఉందని కాంగ్రెసు రాయలసీమకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనలో కొంత గందరగోళం ఉందని, దాంతోనే వివాదం చెలరేగిందని, తాము ఢిల్లీ వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా సీమాంధ్ర ప్రతినిధి బృందంతో ఢిల్లీ వచ్చిన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయనతో పాటు మిగతా శాసనసభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణమయ్యారు.
ఢిల్లీ లాబీయింగ్ తమకు సంతృప్తినిచ్చిందని, పార్టీ అధిష్టానం ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం పూర్తిగా జరిగిపోయింది, పంపకాల వ్యవహారం మాత్రమే మిగిలి ఉందనే అభిప్రాయం చిదంబరం ప్రకటన వల్ల అర్థం చేసుకున్నారని, దాంతో ఆందోళన పెల్లుబుకిందని, తాము ఇక్కడికి వచ్చిన తర్వాత అది కాదని తెలిసిందని ఆయన అన్నారు. అందరి మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే రాష్ట్ర విభజన ముందుకు సాగుతుందనేది తమకు అర్థమైందని, రాష్ట్ర విభజనకు తప్పకుండా శాసనసభ తీర్మానం కూడా అవసరమని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి