హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేయాలని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము రాజీనామా చేయాలని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. తమ రాజీనామా లేఖలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించి వాటి ప్రతులను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపనున్నట్లు మాజీ హోం మంత్రి కె. జానా రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టినా తెలంగాణవారెవరూ అందులో చేరబోరని దామోదర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ పార్టీ శాసనసభ్యులంతా రాజీనామాలు చేస్తున్నట్లు ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తామని ఆయన చెప్పారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని, లేదంటే తమ రాజీనామాలను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆందోళన సాగించాలని జానా రెడ్డి కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పులను, లాఠీచార్జీని ఆయన ఖండించారు. ఆర్టీసి చైర్మన్ పదవికి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు రాజీనామా చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి