హైదరాబాద్: రిలయన్స్ సంస్థలపై దాడుల కేసులో కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ మాజీ రాష్టాధ్యక్షుడు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అనుచరుడు వంశీచందర్ రెడ్డిని పోలీసులు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై రష్యన్ వెబ్ సైట్ ది ఎగ్జైల్డ్ వార్తా కథనం టీవీ చానెళ్లలో ప్రసారం కావడానికి ముందే రిలయన్స్ పై దాడులు చేయాలని వంశీచందర్ రెడ్డి కార్యకర్తలకు మెసేజ్ పంపాడని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు వంశీచందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
వంశీచందర్ రెడ్డి ఏ ప్రాతిపదికన మెసేజ్ పంపాడనే విషయంపై సిఐడి పోలీసులు విచారణ జరిపారు. ఆయనపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. ఇందులో హైదరాబాదులోని సైదాబాదులో దాడి చేసిన సంఘటనకు సంబంధించిన కేసు కూడా ఉంది. రిలయన్స్ పై దాడుల కేసుల్లో పోలీసులు పలువురిని తమంత తాముగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. తాజాగా గుంటూరు కాంగ్రెసు నాయకుడు కూచిపూడి సాంబశివరావును సోమవారం అరెస్టు చేశారు. మాజీ మంత్రి మారెప్పపై కర్నూలులో కేసు నమోదు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి