కదం తొక్కుతున్న పందెం కోళ్ళు-పోలీసులపై వత్తిళ్ళు

మూడెకరాల పొలంలో సకల ఏర్పాట్లతో ఇక్కడ పందేలు జరుగుతాయి. ఈసారి వెంట్రప్రగడలో కాకుండా సమీపంలోని దోసపాడులో పందేల నిర్వహణకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అక్కడ సాధ్యం కాని పక్షంలో కైకలూరు సమీపంలోని మరో ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకచోట పందేలు జరుపుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు లోపాయకారీగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు సమీప జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి భారీ స్థాయిలో పందెగాళ్లు వస్తుంటారు. కార్లు, ఇతర వాహనాల పార్కింగ్ కోసమే ఇక్కడ అర ఎకరాన్ని కేటాయిస్తారు. మరోవైపు నూజివీడు, తిరువూరు తదితర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో పందేలు వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురం, ముసునూరు, ఎ.కొండూరు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, మూలపాడు అడవుల్లో పందేలు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతోపాటు స్థానిక పోలీసులతో ఎక్కడికక్కడ రాజీ కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం చిన్న పందేలపై ప్రతాపం చూపుతూ తాము పందేల విషయంలో కఠినంగా ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం నూజివీడు సమీపంలో పందేలు జరుగుతుండగా పోలీసులు వస్తున్నారనే భయంతో ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ సాకుతో పోలీసులను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు.