హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి శ్రీధర్ బాబు వెనక్కి తగ్గారు. మంగళవారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. తాము రాజీనామాలు ఉపసంహరించుకున్నట్లు వారు డిఎస్ తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులతో రాజీనామాలు ఉపసంహరింపజేసే పనిలో నిమగ్నమైన డిఎస్ మంగళవారం ఈ ఇద్దరు మంత్రులకు నచ్చజెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైందని తాము భావిస్తున్నామని, తెలంగాణ వస్తుందనే నమ్మకం కుదిరిందని, అందుకే తాము రాజీనామాలు ఉపసంహరించుకున్నామని శ్రీధర్ బాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకంతో తాము విధులకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. పదవుల్లో కొనసాగుతూనే తెలంగాణ సాధన దిశగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ 9వ తేదీ ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి