న్యూఢిల్లీ: తెలంగాణపై కచ్చితమైన మాట కావాలని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సంఘ్వీ అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలని, దానికి విస్తృత చర్చలే శరణ్యమని ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల అవగాహన భిన్నంగా ఉండవచ్చునని, భాగస్వాములు దీనిపై ఏకాభిప్రాయం సాధిస్తే తాము దానికి అనుగుణంగా పనిచేస్తామని, విమర్శించే వారు కచ్చితంగా ఏకాభిప్రాయం సాధించి పెట్టాలని ఆయన అన్నారు. అందుకు అవసరమైన యంత్రాంగాన్నైనా సూచించాలని, తాము దాని కోసమే కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
సంప్రదింపుల ద్వారానే ఏకాభిప్రాయం ఏర్పడాల్సి ఉంటుందని తాము చెబుతున్నామని, చర్చల ప్రక్రియ లేకుండా ఏకాభిప్రాయం సాధ్యం కాదని, అరకొర చర్చలు ఏకాభిప్రాయానికి సరిపోవని ఆయన అన్నారు. ఏకాభిప్రాయమంటే కూర్చున్న ప్రతి ఒక్కరూ అంగీకరించాలని కాదని, ఎక్కువ మంది ఆమోదం తెలపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కువ మంది తెలంగాణ కావాలనో, వద్దనో చెప్పాలని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి