కోనసీమలో కోడిపందేలకు అడ్డు అదుపూ లేదు

గోడిలంక, రాజోలు ప్రాంతాల్లో అత్యధికంగా లక్షల్లో పందేలు సాగాయి. సంక్రాంతి పర్వంలో తొలిరోజైన భోగినాడు జిల్లాలో సుమారు కోటిరూపాయల వరకు పందేలు సాగినట్టు సమాచారం. ప్రజాప్రతినిధులు సైతం దగ్గరుండి కోడిపందేలు నిర్వహించడం విశేషం. అల్లవరం మండలం గోడిలంకలో భారీస్థాయిలో కోడిపందేలు జరిగాయి. మండలానికి చెందిన పందెంరాయుళ్లతోపాటు పరిసర మండలాలు, పొరుగు జిల్లాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోడిలంకలో ఒక కొబ్బరితోటలో నాలుగు బారులుగా పందేలు నిర్వహించారు. ఈ పోటీల నిర్వహణకు అనుమతినిచ్చేందుకు భారీ ఎత్తున సొమ్ము చేతులు మారినట్టు సమాచారం.
పందేలు జరిగే ప్రాంతంలో రెండు గుండాట బోర్డుల నిర్వహణ పాట రూ.రెండు లక్షలలకు, మూడు రోజులూ ఆ ప్రాంతంలో మద్యం విక్రయించేందుకు బెల్టుషాపు పాట రూ.15 వేలకు వెళ్లిందని తెలిసింది. నిర్వాహకులు పందెం స్థాయిని బట్టి రూ.200 నుంచి నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ పందేలను అడ్డుకునేందుకు అల్లవరం ఎస్సై, సిబ్బంది ప్రయత్నించినా, పై అధికారుల నుంచి ఫోన్‌లు రావడంతో వెనుదిరగాల్సి వచ్చిందంటున్నారు.












Click it and Unblock the Notifications
