విజయవాడ: మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే పేరుగాంచిన నూజివీడులో రూ 41.50కోట్ల రూపాయలతో రూరల్ హార్టికల్చర్ ఇన్ ఫ్ర్రాస్టక్చర్ యూనిట్(ఆర్ హెచ్ ఐ యు)ను నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మం, పశ్చిమ గోదావరి రైతులకు కూడా ఈ యూనిట్ ఉపయోగకరంగా ఉంటుంది. మరోమూడునెలల్లో రానున్న మామిడి సీజన్ నాటికి ఈ యూనిట్‌ను నెలకొల్పే అవకాశాలున్నాయి. జిల్లాలో నాబార్డ్ ఆధ్వర్యంలో అమలయ్యే పధకాలపై ఇటీవల ఒక సమగ్ర నివేదికను రూపొందించారు. ఈనివేదికలో నూజివీడులోని యూనిట్‌ను గురించి ప్రస్తావించారు. మామిడి రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఈయూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈయూనిట్ ద్వారా సుమారు వెయ్యిమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. రైతులు మామిడి కోత సమయంలో అనుసరించాల్సిన కొన్ని విధానాలను పాటించకపోవడంతో 20నుంచి 25శాతం నష్టాలను పొందుతున్నారు.
ఈ యూనిట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్, ప్రీకూలింగ్ ఛాంబర్, చిన్న,పెద్ద కాయలను వేరు చేయడం, నాణ్యత గల కాయలను వేరు చేయడం, ప్యాకింగ్, వే బ్రిడ్జిల వంటివి ఉంటాయి. ఇదే విధంగా నాణ్యతా ప్రమాణాలను సరిచూసే యూనిట్‌తోపాటు కాయలను వేలం వేయడం, పంపిణీ వంటి విభాగాలు కూడా ఉంటాయి. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎ పి అగ్రోస్ సంస్థ నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుంది. ఐదు సంవత్సరాల పాటు మార్కెటింగ్ వసతులను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే మూడు ఎకరాల భూమిని కూడా ఎంపిక చేశారు. మరోవైపు ఎపెడా కూడా వేపర్‌హీట్ ట్రీట్‌మెంట్ యూనిట్‌కు సహకరిస్తుంది. సుమారు పదికోట్ల రూపాయల వ్యయంతో దీనిని ఏర్పాటు చేస్తుండగా ఎపెడా రూ 8.34 కోట్లు వ్యయం చేస్తున్నది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి