హైదరాబాద్: తెలంగాణ జన జాగృతి నేత కల్వకుంట్ల కవితపై కేసు నమోదు చేయడం పట్ల వివిధ సంఘాలకు చెందిన తెలంగాణ నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. హైదరాబాదును స్మశానంగా మారుస్తామని ప్రకటించిన టాలీవుడ్ నటుడు మోహన్ బాబును ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ విమోచన సమితి (టివిఎస్) నాయకుడు వి. ప్రకాష్ ప్రశ్నించారు. తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కేసు పెట్టిన పోలీసులు మోహన్ బాబును ఎందుకు వదిలేశారని ఆయన శుక్రవారం ప్రశ్నించారు. తెలంగాణ నేతలపై కేసులు పెట్టడం రెచ్చగొట్టడానికేనని ఆయనతో పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస్ విమర్శించారు.
కాగా, తెలంగాణ నాయకులపై కేసులు పెడుతుండడాన్ని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా తప్పు పట్టారు. ప్రజలను రెచ్చగొట్టడానికే తెలంగాణ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన నిజామాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ నాయకులపై కేసులు పెడుతూ ఆంధ్ర నాయకులను వదిలేస్తూ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. కవితపై ఈ నెల 12వ తేదీననే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ విషయాన్ని శుక్రవారం వరకు బయటకు రాకుండా చూశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి