హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇప్పటివరకు అంత సీరియస్ గా లేని మంత్రి దానం నాగేందర్ గళం మార్చారు. గ్రేటర్ హైదరాబాద్ వాదనను పక్కన పెట్టి తెలంగాణకు మద్దతు పలుకుతున్నామని నాగేందర్ అన్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర నేతలు అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యల కంటే మీ వ్యాపార ప్రయోజనాలు ముఖ్యమా అని దానం ప్రశ్నించారు. గురువారం ఆయన జూబ్లీహాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కావూరి సాంబశివరావు లాంటి నేతలు వ్యాపార ప్రయోజనాల కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నారన్నారు.
ఈ విషయంలో సీమాంధ్ర నేతలు మానవతా దృక్పదంతో ఆలోచించాలన్నారు. కేంద్రాన్ని తప్పుదోవ పట్టించేందకు వారు చేస్తున్న ప్రయత్నాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అధిష్టానంపై ఒత్తిడి తేవాలంటూ సీమాంధ్ర నేతల కన్నా ఎక్కువ ఒత్తిడే తెస్తామన్నారు. రాజీనామాలతో సమస్యకు పరిష్కారం లభించదన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా దానం విజ్ఞప్తి చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి