సమైక్యాంధ్రపై కేంద్రం విధాన ప్రకటన చేయాలి: జెఎసి

వివిధ పార్టీలు, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికసంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని, ఉద్యమానికి జేఏసీ సుప్రీం అని తేల్చిచెప్పారు. తొలుత ఎంసీఏ విద్యార్థి వేణుగోపాలరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్రలో శాంతియుతంగా ఆందోళన చేపట్టాలన్నారు. పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు జేఏసీ నడుం బిగించాలన్నారు. ఈ సమావేశం దృష్ట్యా బుధవారం విశాఖలో నిర్వహించాల్సిన పీఆర్పీ భేటీని వాయిదా వేశామన్నారు.
జేఏసీ కన్వీనర్ శామ్యూల్ మాట్లాడుతూ అమరజీవుల త్యాగం, ప్రపంచస్థాయిలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్టీఆర్, సాఫ్ట్‌వేర్ విప్లవాన్ని తెచ్చిన చంద్రబాబు, సంక్షేమ పథకాలు అమలుచేసిన వైఎస్ స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. 17 రాష్ట్రాల్లో 70 ఏళ్లుగా ఉద్యమాలు సాగుతుండగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌నే ఎందుకు విభజిస్తున్నారని చిదంబరాన్ని అడగ్గా మౌనం వహించారన్నారు.