సత్యం రామలింగరాజుపై తెర వెనుక వాస్తవాలు

లియో టాల్ స్టాయ్ రాసిన "హౌ మచ్ ల్యాండ్ డజ్ ఎ మ్యాన్ నీడ్" అనే కథ రామలింగరాజు దురాశకు, భూమిపై పేరాశకు అక్షరాలా అద్దం పడుతుంది. ఆ కథలో పహోమ్ అనే ఒక రైతు తనకు ఇంకా ఎక్కువ పొలం ఉండాలని, పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంటే తన జోలికి సైతాన్ కూడా రాదని కలలు కంటూ ఉంటాడు. చివరికి ఒక మంచి ఆఫర్ వస్తుంది. ఒక ప్రాంతంలోని రైతు కుటుంబం అతనికి ఆకర్షణీయమైన ఆఫర్ ఇస్తుంది. దీని ప్రకారం పహోమ్ వెయ్యి రూబుల్స్ చెల్లించాలి. సూర్యోదయం మొదలు కుని అతను పొలాల గుండా పరుగులుతీయాలి. సూర్యాస్తమయం లోపు ఆతను ఎంత భూమిని కవర్ చేసుకుని, మొదట బయలు దేరిన ప్రాంతానికి చేరుకుంటాడో ఆ భూమి అంతా అతనిదే. అంటే కొన్ని వేల ఎకరాలు. సూర్యాస్తమయం లోపు ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయాలనుకుని అకలి, దాహం చూసుకోకుండ పరుగులు తీస్తాడు. చివరికి బయలుదేరిన పాయింట్ కు చేరుకునే సరికి అతను బాగా అలిసిపోయి డస్సిపోయి ఉంటాడు. ఆ పాయింట్ కు రాగానే అతను కుప్పకూలిపోతాడు. ప్రాణాలు విడుస్తాడు. చివరికి అతడిని ఆరు అడుగుల గోతిలో పూడ్చిపెడతారు. మానవుడి అత్యాసకు అద్దం పట్టే మంచి నీతి కథ ఇది.
హైదరాబాద్ శివారులోను, వంద కిలోమీటర్ల దూరంలోను రామలింగరాజు దాదాపు మూడు వేల ఎకరాలు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. కోర్టులు వాటిలో కొంత భాగాన్ని సీజ్ చేయగా మరికొంత భాగం అమ్మిన రైతుల నుంచి రిజిస్టర్ కాకుండా పడిఉంది. ఈ భూముల కోసం ఆయన సత్యంలో తన షేర్లను అమ్ముకున్నారు. అంతకు ముందు లేని లాభాలను చూపించి షేర్ విలువ పెంచి, ఇతర షేర్ హోల్డర్లను మోసం చేశారు. ఆ భూములను కుటుంబ సంస్ధ అయిన మేటాస్ కోసం కొనుగోలు చేశారు. చివరికి సత్యం నుంచి, మేటాస్ నుంచి నిధులను దారి మళ్ళించారు.
సత్యం అధినేతగా బ్రేక్ ఫాస్ట్ ఒక దేశంలో, లంచ్ మరో దేశంలో, డిన్నర్ ఇంకొక దేశంలో చేసిన రాజుగారు జైలు ఆవరణలో రౌడీ షీటర్లతో సహజీవనం చేయవలసి వస్తోంది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. జైలు నుంచి విడుదల కావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేం. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రాజకీయ నాయకులకు భారీగా లంచాలు ఇచ్చారని, అవి తిరిగిరావని విశ్వసనీయ వర్గాల కథనం. రాజు ఇంత గొప్పగా వ్యాపారసమ్రాజ్యాన్ని 65 దేశాల్లో ఎలా విస్తరించారు? చట్టానికి, షేర్ హోల్డర్లకు, ఉద్యోగులకు తెలియకుండా ఎనిమిదేళ్ళ పాటు ఆయన ఇంత పెద్ద నాటకం ఎలా ఆడారు? ఈ ఆసక్తికరమైన విషయాలతో టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ యూనిట్ రెసిడెంట్ ఎడిటర్ రాసిన పుస్తకం ఇది. అభిరుచి గల పాఠకులు తప్పకుండా చదవవలసిన పుస్తకమిది.