విశాఖపట్నం: విశాఖ జిల్లాలో పుట్టి మునిగి ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. ఉప్పుటేరు పడవ ప్రమాదం మర్చిపోకముందే విశాఖలో మరో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. విశాఖ జిల్లా గోలుకొండ మండలం అమ్మం పేట వద్ద తాండవ జలాశయంలో ఆదివారం మధ్యాహ్నం ఓ పుట్టి మునిగిపోయింది. పుట్టిలో పది మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరిలో ఇప్పటివరకూ ఇద్దరి మృతదేహాలు లభించాయి.
ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, గల్లంతయిన మరో ఆరుగురి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అమ్మంపేటకు చెందిన రెండు కుటుంబాలు జాతరకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తున్నది. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.