ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే
పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా.. ఉస్తాద్ భగత్ సింగ్. హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు స్టే జారీ చేసింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతించే ఏ నిర్ణయాన్నైనా సినిమా విడుదల కావడానికి 90 రోజుల ముందే ప్రకటించాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. దీంతో టిక్కెట్ల ధరల ఆమోదాలకు సంబంధించి ప్రస్తుత విధానమే కొనసాగుతుంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎ.ఎస్. చందూర్‌కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు తెలంగాణలో విడుదలయ్యే అన్ని చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ఈ విషయంలో తక్షణ జోక్యం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిటీషన్ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది.
హైకోర్టు ఉత్తర్వులను మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, నిరంజన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా సినిమా విడుదలలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. సినిమా విడుదల కావడానికి 90 రోజుల ముందు టిక్కెట్ ధరల పెంపుదల నిర్ణయాలను బహిర్గతం చేయాలనే హైకోర్టు నిబంధనకు ప్రాతిపదిక ఏమిటని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు.
సినిమా వచ్చే వారం విడుదల అవుతోన్నప్పుడు 90 రోజుల ముందే డిస్ క్లోజ్ చేయడం అనేది ఎలా సాధ్యపడుతుందని, మొత్తం సినిమాలే 90 రోజుల్లోపే తీస్తోన్నారని న్యాయవాదులు వాదించారు. బాధిత పక్షాలను వాదనలను వినకుండానే హైకోర్టు ఇతర సందర్భాలలో కూడా ఇలాంటి తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. హైకోర్టు మూడు వేర్వేరు కేసులలో మూడు ఇలాంటి ఆదేశాలను ఇచ్చారని, మధ్యంతర ఉత్తర్వు ద్వారా ఇలా చేయలేరని, పేర్కొన్నారు. వాదనలను విన్న అనంతరం సుప్రీంకోర్టు బెంచ్ స్టే మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications