తిరుపతి: కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటన పూర్తి చేసిన తర్వాతనే తెలంగాణలో పర్యటిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. రాయలసీమ, కోస్తాంధ్రల్లో పర్యటించాల్సిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, సమైక్యాంధ్రవాదుల మద్దతుతో తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడు బాబు సంతాపసభలో ఆయన ఆదివారం మాట్లాడారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సమైక్యాంధ్ర సాధనకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యమంతోనే సమైక్యాంధ్ర సాధ్యమని ఆయన అన్నారు.
కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించబోయే కమిటీ స్వరూపం, సామర్థ్యం తెలియడం లేదని ఆయన అన్నారు. కమిటీ సభ్యులుగా న్యాయమూర్తులు, ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, అన్ని వర్గాల మేధావులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కలిసి ఉంటే ఉండే లాభాలు, విడిపోతే కలిగే నష్టాల గురించి క్షుణ్నంగా చర్చించాలని ఆయన అన్నారు. న్యాయంగా, ఎక్కువ మంది అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి