హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల అత్మబలిదానాలను ఆపడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య దిగి రావాల్సిందేనని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మబలిదానాలు ఆగడానికి ఒక విజ్ఞప్తి చేస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. ఒయులో లాఠీచార్జీ, యాదయ్య ఆత్మహత్య, ఢిల్లీలో తెలంగా లాయర్లపై వాటర్ కానన్ల ప్రయోగంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో మంగళవారం శాసనసభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మబలిదానాలపై సభలో చర్చించాలంటే ప్రభుత్వం వెనక్కి పోతోందని ఆయన అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో గానీ రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో గానీ తెలంగాణ అంశం గానీ శ్రీకృష్ణ కమిటీ అంశం గానీ ప్రస్తావనకు రావకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
లాఠీచార్జీల ద్వారా, ఇతర బలప్రయోగాల ద్వారా తెలంగాణ ప్రజలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. విద్యార్థుల ఆత్మబలిదానాలను ఆపడానికి తీర్మానం చేయలేని దుస్థితిలో శాసనసభ ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రోశయ్య దిగిరావాలని ఆయన అన్నారు. మరో ఇద్దరు తెలుగుదేశం శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి