ప్రధానితో విజయ్ భేటీ..! నిర్మొహమాటంగా కీలక డిమాండ్లు..!
తమిళనాడులో తొలిసారి రాజకీయ పార్టీని స్దాపించి, రెండేళ్లలోనే ముఖ్యమంత్రి కూడా అయిన విజయ్(Vijay).. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi)ని ఢిల్లీలో తొలిసారి కలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన పలు సమస్యల్ని ప్రధానితో భేటీలో ఆయన ప్రస్తావించారు. ఇందులో కర్నాటక నిర్మిస్తున్న మెకదాతు ప్రాజెక్టుకు అనుమతుల నిరాకరణ, తమిళనాడు రాష్ట్ర గీతానికి ప్రాధాన్యం సహా పలు అంశాలున్నాయి.
ప్రధాని మోడీతో తొలిసారి జరిగిన 20 నిమిషాల భేటీలో విజయ్.. ఇటీవల హాలండ్ నుండి పురాతన రాగి ఫలకాలను తిరిగి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కర్నాటకలోని మెకెదాటులో డ్యామ్ ప్రాజెక్ట్ కు కేంద్రం అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తన రాష్ట్రంలోని దిగువ ప్రాంతాలలో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందని ప్రధానికి తెలిపారు. రెండు రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా ఆనకట్ట నిర్మించే ఏ ప్రయత్నమైనా కావేరీ జల ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. అటువంటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం కాబట్టి, ఆనకట్ట నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజయ్ ప్రధాని మోదీని కోరారు.

మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలని కూడా కోరారు. జాతీయ గీతం, జాతీయ గేయం రెండింటినీ కలిపి ప్లే చేయాల్సి వచ్చినప్పుడు, వందేమాతరంలోని ఆరు చరణాలను ముందుగా పాడాలని జనవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ అభ్యర్థన చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారంలో వందేమాతరం, జనగణమన తర్వాత రాష్ట్రగీతం ఆలపించడం స్దానికంగా విమర్శలకు కారణమైంది. ప్రధానితో భేటీ తర్వాత విజయ్.. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతోనూ సమావేశం కానున్నారు.














Click it and Unblock the Notifications