హైదరాబాద్: మైలవరం నుంచి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపిఎస్)ను కాదని బ్రాహ్మణి స్టీల్స్ కు నీరు అందించడంపై బుధవారం శాసనసభలో తీవ్ర రభస జరిగింది. ప్రభుత్వ తీరు దారుణమని తెలుగుదేశం సహా ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎంలు వ్యాఖ్యానించాయి. బ్రాహ్మణి స్టీల్ కు నీటి సరఫరాపై పునరాలోచన చేయాలని స్పీకర్ కె కిరణ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రికి సూచించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాల సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతుకు ముందు బ్రాహ్మణి స్టీల్స్ కు నీటి సరఫరాపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. ఆర్టీపిఎస్ మైలవరం నుంచి వారం రోజుల క్రితం నీరు అడిగితే ప్రభుత్వం కుదరదని చెప్పిందని, వారం తిరగకుండా బ్రాహ్మణి స్టీల్స్ అడిగితే నీరు ఇచ్చారని, ఇది సమంజసం కాదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దాన్ని కాంగ్రెసు ప్రభుత్వం సమర్థించుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
ప్రజావసరాలను తీర్చే విద్యుత్తు ప్రాజెక్టుకు నీరివ్వకుండా బ్రాహ్మణి స్టీల్స్ కు ఎలా ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకుని ఆర్టీపిఎస్ కు నీరివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గుండికోట నుంచి మిగులు జలాలను తరలించే సమయంలో అందులో కొంత నీటిని మాత్రమే బ్రాహ్మణి స్టీల్స్ కు ఇచ్చామని, ఆర్టీపిఎస్ కు ఇబ్బంది కలిగించే ప్రసక్తి లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి భారీ నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి వెనకాడే ప్రభుత్వం అడగ్గానే బ్రాహ్మణీ స్టీల్స్ కు నీరు ఇవ్వడం ఏం న్యాయమని ప్రజారాజ్యం పార్టీ సభ్యులు ప్రశ్నించారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజారాజ్యం శాసనసభ్యుడు కన్నబాబు డిమాండ్ చేశారు.