Hormuz : హార్ముజ్ లో ఎదురేలేని భారత్ ..! దిగ్బంధాన్ని దాటే సీక్రెట్ వ్యూహం..!
ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధంలో ప్రవేశించినప్పటి నుంచీ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి (strait of hormuz) దాదాపుగా దిగ్బంధంలో ఉంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఈ ఇరుకైన జలమార్గం ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో దాదాపు 20 శాతాన్ని మోసుకెళ్తుంది. ఈ అంతరాయం ఇంధన మార్కెట్లను కలవరపరిచి, ఇంధన ధరలను పెంచింది. తద్వారా ఆసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత భయాలను పెంచింది. ఏప్రిల్ 9న కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చాక కూడా ఈ జలసంధి చాలా వరకు మూసివేతలోనే ఉంది.
దీంతో హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకలు దాటేందుకు వీలు కావడం లేదు. అయితే, ఇంత అనిశ్చితి మధ్య కూడా అనేక భారత అనుబంధ నౌకలు ఈ ప్రమాదకర మార్గం గుండా ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో తీవ్ర అంతరాయాలు ఉన్నప్పటికీ, భారత్ తన ఇంధన సరఫరాలను కొనసాగించడానికి ఇది దోహదపడుతోంది. ఈ నౌకల రాకపోకలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు భౌగోళికంగా గణనీయమైన ప్రయోజనం ఉంది. ఫిబ్రవరి 28న యుద్ధానికి కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ నౌకలను పదేపదే లక్ష్యంగా చేసుకుంది.

అయితే ఇలా భారతీయ నౌకలు మాత్రం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా హార్ముజ్ ను దాటడం వెనుక కీలక కారణాలున్నాయి. తాజాగా జరిగిన అంతర్-మంత్రిత్వ శాఖ సమావేశంలో, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఉద్రిక్త జలమార్గం గుండా భారత్ నౌకల కదలికలను ఎలా నిర్వహిస్తుందో వివరించారు. అయితే కార్యాచరణ వివరాలను మాత్రం వెల్లడించలేదు. తాము భారత్-ఇరాన్‌లతో ఎలా సమన్వయం చేసుకుంటాం, ప్రాధాన్యతను ఎలా నిర్ణయిస్తాం అనేవి స్పష్టమైన కారణాల రీత్యా చెప్పదలుచుకోలేదని, కానీ మేము విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా సమన్వయం చేసుకుంటామని, అది తమ విధానమని పోర్టుల మంత్రిత్వ శాఖ షిప్పింగ్ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ పేర్కొన్నారు.

తాజా వివరాల ప్రకారం ప్రస్తుతం దాదాపు 13 భారత జెండా ఉన్న నౌకలు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో ఒక ఎల్‌పీజీ ట్యాంకర్, ఐదు ముడి చమురు ట్యాంకర్లు, ఒక రసాయన లేదా ఉత్పత్తి ట్యాంకర్, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్‌లు మరియు ఒక డ్రెడ్జర్ ఉన్నాయి. ప్రమాదం ఉన్నప్పటికీ, భారత్ ఈ మార్గం గుండా సముద్రయాన రవాణాను కొనసాగిస్తోంది. ఈ జలసంధిని దాటుతున్న అత్యధిక సంఖ్యలో నౌకలున్న దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తోంది. ఫిబ్రవరి 28 నుండి ఈ జలమార్గాన్ని దాటిన భారత అనుబంధ నౌకలలో శివాలిక్, నందా దేవి, జాగ్ లాడ్కీ, పైన్ గ్యాస్, జాగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి వంటివి ఉన్నాయి.












Click it and Unblock the Notifications