హైదారబాద్: ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు శనివారం శాసనసభలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మహిళా రిజర్వేషన్లలో ముస్లిం కోటాపై కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ చేసిన తీర్మాంలో చేర్చాలని పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. బడ్జెట్ పై సమాధానం ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా నిర్లక్ష్యంగా ముఖ్యమంత్రి రోశయ్య వెళ్లిపోవడంపై కూడా ఆయన ప్రశ్నించారు.
బడ్జెట్ పై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి రోశయ్య శుక్రవారం సమాధానమిచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు వివరణ అడుగుతుండగా రోశయ్య లేచి వెళ్లిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీన్ని అక్బరుద్దీన్ శనివారం శాసనసభలో ప్రస్తావించారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇస్తారని చెప్పినా వినలేదు. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.