హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం తెలుగుదేశం తన వ్యూహమేమిటో చెప్పాలని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణకోసం తెలుగుదేశం వ్యూహమేమిటనేది మాత్రమే తాము అడుగుతున్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టత అవసరమని ఆయన అన్నారు. ఇక్కడ తెలంగాణ అంటూ అక్కడ సమైక్యవాదం అంటూ రెండు వైఖరులు సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సింది కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వమని, యుపిఎ తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఒత్తిడి తేవాల్సి ఉందని, ఆ పనిని కాంగ్రెసు సరిగా నిర్వర్తించనప్పుడు ప్రధాన ప్రతిపక్షంపై బాధ్యత పెరుగుతుందని, ఆ బాధ్యతను నిర్వర్తించాలని మాత్రమే తాము తెలుగుదేశం పార్టీని అడుగుతున్నామని ఆయన అన్నారు.
తెలంగాణ సాధనకు తెలుగుదేశం పార్టీ మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుందని, స్పష్టమైన వ్యూహం రచించాలని ఆయన అన్నారు. అందుకు తెలుగుదేశం వైఖరి స్పష్టంగా ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెసు తన బాధ్యతను నిర్వర్తించడం లేదని తాము చెబుతూనే ఉన్నామని, కాంగ్రెసు నిర్వర్తించనప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోందని ఆయన అన్నారు. తాము కాంగ్రెసును నిలదీస్తూనే ఉన్నామని, కాంగ్రెసుపై తాము ఒత్తిడి తేవడంలేదనే విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు. తప్పించుకుంటున్న కాంగ్రెసుపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీపై ఉంటుందని ఆయన అన్నారు.