హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన విధంగానే తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ ప్రకటనలు చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీని జెఎసి నుంచి బహిష్కరించిన నేపథ్యంలో తెలుగుదేశం తెలంగాణ నాయకులు శనివారం సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. తమ పార్టీ స్వయంగా తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతుందని, అవసరమనుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసమే తాము జెఎసిలోకి వచ్చామని ఆయన చెప్పారు. జెఎసి తెలంగామ ఉద్యమాన్ని బలోపేతం చేస్తుందో లేదా బలహీనం చేస్తుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జెఎసిని మొదట ధిక్కరించింది తెరాసయే అని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని కోదండరామ్ విమర్సలు చేయడం తగదని ఆయన అన్నారు. కెసిఆర్ నిర్ణయాన్నే కోదండరామ్ వెల్లడిస్తున్నారని ఆయన విమర్శించారు.